తెలుగు బ్లాగ్వనంలో మరో కొత్త బ్లాగు...

సీనియర్‌ తెలుగు బ్లాగర్లందరికీ ముందుగా 'జై హో' లు!


(ఇవాళే యాహూలో చాలామంది హలో కి/ నమస్తే కి బదులు ''జైహో'' అన్న పదాన్ని వాడుతున్నట్టు గమనించాను.)


ఉత్తరాలు రాసే అ లవాటు నాకు చాలా చిన్నతనంలోనే అబ్బింది.
బహుశా ఏ రెండో తరగతి చదువుతున్నప్పుడే నేను మొదటి ఉత్తరాన్ని రాసివుంటానని అనుమానం.


మా అమ్మా నాన్నలతో పాటు ఇరుగుపొరుగువాళ్లలో చాలా మంది నిరక్షరాస్యులవడం చేత - నేను అక్షరాలు పూర్తిగా నేర్చుకోకముందే ... తమ ఉత్తరాలు చదివించుకునేందుకు, వాటికి సమాధానాలు రాయించుకునేందుకు వాళ్లు నా మీద ఆధారపడేవారు. బలవంతపెట్టేవారు.


ఆవిధంగా నేను పసిప్రాయంలోనే ''ఉత్తర కుమారుడి'' నయ్యాను.

కాస్త వయసొచ్చేసరికి ఉత్తరాలు రాయించుకునే వాళ్లకి ఔట్‌సోర్సింగ్‌ సదుపాయాలు ఎక్కువవడంతో నాకు చేతినిండా పనిలేకుండాపోయింది.
అప్పుడు నేను డబ్బుకట్టి మరీ ''కలం స్నేహితుల'' క్లబ్బుల్లో చేరి ముక్కూ మొహం తెలియని వాళ్లతో పుంఖాను పుంఖాలుగా ఉత్తరప్రత్యుత్తరాలు నెరిపాను.


కొన్నాళ్లకి కలం స్నేహం కూడా ఔట్‌డేట్‌ అయిపోయి ఆ క్లబ్బులూ ఆ సాంప్రదాయమూ సైతం అంతరించిపోయాయి.

ఇంటర్నెట్‌ వచ్చాక నిన్న మొన్నటివరకు అడపాదడపా ఇంగ్లీషు స్పెల్లింగుతో చిట్టిపొట్టి తెలుగు ఇమెయిల్లు వస్తుండేవి. కానీ ఫోన్లు చీపైపోయాక ఇప్పుడవీ కరువైపోయాయి. తెలుగు అక్షరాలను వాడే అవకాశమే లేకుండా పోవడం చాలా అశాంతిని కలిగిస్తోంది. అట్లాంటి దశలో ఈ బ్లాగులు నా కంటపడ్డాయి.


వాగే నోరు, రాసే చెయ్యి ఊరుకోవంటారు!
నాది వాగే నోరు కాకపోయినా రాసే చెయ్యే అని చెప్పుకోవచ్చు. అందుకే నేనీ బ్లాగును ప్రారంభిస్తున్నాను.


బ్లాగు అంటే బహిరంగ ఉత్తరం.
ఒకేసారి ఒక ఉత్తరాన్ని అనేక మందికి రాయడం .
నా మట్టుకు నాకు ఇది చాలా కొత్త ప్రక్రియ .


చూద్దాం ఎంతకాలం ఎంత ప్రయోజనకరంగా ఈ వ్యాసంగాన్ని కొనసాగించగలనో !
ప్రస్తుతానికి ఇంతే సంగతులు.
సెలవు
జై హో !